Thursday 21 July 2016

వృక్షాన్ని... మీ ప్రాణ భిక్షాన్ని...

వృక్షాన్ని... మీ ప్రాణ భిక్షాన్ని...
చెట్టు, పర్యావరణం...ఆత్మ-శరీరం లాంటివి. పర్యావరణం దెబ్బతింటే, చెట్టు సంక్షోభంలో పడుతుంది. చెట్టు నాశనమైపోతే పర్యావరణం ప్రమాదంలో చిక్కుకుంటుంది. అనగనగా... సృష్టి ఆవిర్భావంతో మొదలైన ఓ చెట్టు ఆత్మకథ అంతర్లీన సందేశమూ అదే.
నిషి గొడ్డలి పట్టుకుని తిరుగుతున్నాడు. అణువణువూ గాలిస్తున్నాడు. ఎక్కడ చెట్టు కనిపించినా కర్కశంగా నరికేస్తున్నాడు. పల్లెల్నీ పట్టణాల్నీ నగరాల్నీ దాటుకుంటూ, పచ్చదనాన్ని నేలమట్టం చేసుకుంటూ అడవుల వైపు అడుగులేస్తున్నాడు. 
అదో ఉన్మాదం.
అదో ఉగ్రవాదం.
‘ఇదే, సృష్టిలో చిట్టచివరి చెట్టు!
దెబ్బతో వృక్షజాతి అంతరించిపోతుంది...’
అంటూ రౌద్రంగా రంకెలేస్తున్నాడు.
‘నీ శ్రేయోభిలాషిని’ - మొత్తుకున్నాను. ‘నీ వూపిరిలో గాలిని’ - వేడుకున్నాను. ‘నీ బాల్యానికి వూయలని’ - గుర్తుచేశాను. ‘నీ పెళ్లిలో తోరణాన్ని’ - మురిపించే ప్రయత్నం చేశాను. ‘నీ శవానికి కట్టెని’ - భయపెట్టాలనీ చూశాను. అయినా మనిషి తగ్గలేదు. వదిలిపెట్టమని వేడుకున్నాను, కనికరించమని కన్నీళ్లు పెట్టుకున్నాను. నిర్దయగా గొడ్డలి పైకిలేచింది.
గట్టిగా వూపిరి వదిలాను...
‘మానవజాతికి నేను అందించే చిట్టచివరి ప్రాణవాయువు ఇదే’ - అనిపించింది.
అంతలోనే, అనూహ్య సంఘటన. ఆ పెనుగాలికి మనిషి దూదిపింజలా ఎగిరిపోయాడు. ఆ జల ప్రళయానికి వూళ్లకు వూళ్లు కొట్టుకుపోయాయి. భూగోళం మహాశ్మశానమైపోయింది.
- కలే! నిజం లాంటి ఈ కల..నిత్యం నా కళ్లముందు కనిపిస్తూనే ఉంటుంది. ఒకవైపు, భవిష్యత్తు ఇంత ఘోరంగా ఉండబోతోందా అన్న భయం, మరోవైపు మనిషి మారకపోతాడా, తప్పు తెలుసుకోలేకపోతాడా అన్న ఆశ.
ఆశ గెలుస్తుందో, నిరాశ మిగుల్తుందో - కాలమే నిర్ణయిస్తుంది.
*
మూడొంతుల నీళ్లూ.
ఒక వంతు నేలా.
నేలనిండా చెట్లే.
ఆరంభంలో ఈ భూమి మాదే, వృక్షాలదే. మా పుట్టుక విషయంలో రకరకాల సిద్ధాంతాలున్నాయి. ఏదో ఓ పెను పరిణామంలో...తొలి విత్తో, తొలి మొక్కో ప్రాణంపోసుకుని ఉండాలి. ఆ మొక్క నుంచి మరో మొక్క, ఆ విత్తు నుంచి ఇంకో విత్తు...ప్రపంచమంతా పాకిపోయి ఉండాలి. ఆ రహస్యాన్ని ఛేదించగలిగితే, సృష్టి ఆవిర్భావ క్రమమూ అర్థమైపోతుంది. ఎలాగైనా, నా మూలాల్ని తెలుసుకోవాలన్న తపనతో పురాణాల్నీ తిరగేశాను. సృష్టి ప్రారంభంలో శ్రీమహావిష్ణువు పసివాడిలా మారిపోయి, తెప్పగా మర్రాకు మీద తేలుతూ ఉన్నాడట. మర్రాకు ఉందంటే, మర్రిచెట్టూ ఉన్నట్టేగా! వటపత్రశాయి కోసం వటవృక్షమూ అవతరించినట్టేగా! ఆ ప్రకారంగా చూసినా...సృష్టికర్త తొలి ఆవిష్కరణ చెట్టే. మేం పుట్టే సమయానికి భూమ్మీద ఏ ప్రాణీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు, జీవులు బతికే వాతావరణమే లేదు. ఎటు చూసినా విష వాయువులే. చెట్టుతో పాటు ప్రాణవాయువూ ప్రాణంపోసుకుంది. వాయుజీవుల ఉనికికి అనువైన పరిస్థితి ఏర్పడింది. జలచరాలూ, భూచరాలూ, ఉభయచరాలూ ఆవిర్భవించాయి. జీవ పరిణామక్రమంలో మనిషి అవతరించాడు. మనుగడ కోసం పోరాటంలో మనిషి నిలదొక్కుకున్నాడు.
*
మనిషి అంటే నాకు గౌరవం. వల్లమాలిన ప్రేమ. నా ముందే పశువై పుట్టి, వానరుడై ఎదిగి, నరుడై అవతరించాడు. అదిగో ఆదిమ మానవుడు! మాటల్లోనే వచ్చేశాడు. ఏ పులో సింహమో తరుముకొచ్చినట్టుంది. భయంభయంగా చెట్టు చాటుకు చేరాడు. చేతిలో ఆయుధం లేదు. గుండెల్లో ధైర్యంలేదు. పీడకలొచ్చినప్పుడు...అమ్మను చుట్టేసుకునే పసివాడిలా నా కాండాన్ని అల్లుకుపోయాడు. కదిలిపోయాను. కరిగిపోయాను. రెండు చేతులూ చాచినట్టు...రెండు కొమ్మలూ వూపాను. ప్రేమకు భాషేమిటి, జాతేమిటి? తెలివైనవాడు! నా సంకేతాన్ని అర్థంచేసుకున్నాడు. గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు. అసలే చలికాలం. ఒంటి మీద నూలుపోగు కూడా లేదు. గజగజా వణికిపోతున్నాడు. నా మనసు విలవిల్లాడింది. నాలుగు ఎండుటాకులు రాల్చాను. వెచ్చగా ఒంటిని కప్పేశాయి. ఆదమరచి నిద్రపోయాడు. తెల్లారాక, వెళ్తూ వెళ్తూ వాటినే నడుముకు చుట్టేసుకున్నాడు. ఫర్వాలేదు. బతకడం నేర్చాడు. బతకనేర్చాడు.
ఆకులు చుట్టుకోవడం నుంచి బట్టలు కట్టుకునే దాకా, ఆహారాన్ని సేకరించడం మొదలు ధాన్యాన్ని పండించుకునే దాకా...మనిషి కథ చాలా మలుపులే తిరిగింది. పంట పండాలంటే, పొలం కావాలి. పొలం కావాలంటే, అడవుల్ని నాశనం చేయాలి. వేలాది చెట్లు నేల కూలాలి.
ఒక వైపు...సంచారజీవి అయిన మనిషి స్థిరపడుతున్నాడన్న ఆనందం. మరో వైపు...అమాయక వృక్షాల తలలు తెగుతున్నాయన్న దుఃఖం. ఇక నుంచీ ఈ భూమి నాది కాదు, మనిషిదే. దాన, విక్రయ, భోజ్యాది సమస్త హక్కుల్నీ అతడికే ధారపోశాను. నా ముందే పొలాలు వెలిశాయి. పల్లెలు పుట్టాయి. పల్లెల సమూహంగా మండలాలూ, మండలాల సమూహంగా రాజ్యాలూ! ఆ రాజ్యానికి రాజులూ. రాచరిక వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న దశలోవే...భారత రామాయణాలు.

ఈ ఏటి నినాదం...
క్క ఆఫ్రికాలోనే రెండేళ్ల కాలంలో లక్ష ఏనుగులు నేలకూలాయి. నూట డెబ్భై టన్నుల ఏనుగు దంతాలు అక్రమంగా సరిహద్దులు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా వన్యమృగ నేరాలు పెచ్చుపెరిగిపోతున్నాయి. ఈ ఘోరాలు ఆయుధాల వ్యాపారంలా, మాదక ద్రవ్యాల దొంగ రవాణాలా వ్యవస్థీకృతం అవుతున్నాయి. పులి చర్మాలూ, జింక తోళ్లూ, నక్షత్ర తాబేళ్లూ - అంగడి సరుకుగా మారుతున్నాయి. ఇంకా, అనేక మృగజాతులు నిశ్శబ్దంగా అంతరించిపోతున్నాయి. స్వార్థంతో మనిషి రక్తబేహారిలా తయారయ్యాడు.
‘గో వైల్డ్‌ ఫర్‌ లైఫ్‌’ - వన్యమృగాల్ని ప్రేమిద్దాం, అవి కనుమరుగు కాకుండా కాపాడుకుందాం అని పిలుపునిస్తోంది ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం - 2016’. ఆ మూగజీవాలన్నీ ఏదో ఓ రూపంలో మనిషికి సాయపడేవే. ‘మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు - వన్యమృగ నేరాల్ని అరికట్టడంలో మీ వంతు పాత్ర పోషించండి. జంతు ప్రేమికుడిగానే కాదు, మనిషిగానూ మిమ్మల్ని మీరు నిరూపించుకోండి’ అని కూడా ఆహ్వానిస్తోంది ప్రపంచ పర్యావణ దినోత్సవం!

ఆదికావ్య ఆరంభం నా సాక్షిగానే జరిగింది. నా చెట్టు కొమ్మ మీద క్రౌంచ పక్షుల జంట కాపురం పెట్టింది. ఎన్ని కిలకిలల కబుర్లూ, ఎన్ని కువకువల ముచ్చట్లూ. అంతలోనే, ఎట్నుంచో బలమైన అడుగుల సవ్వడి. కిరాతుడు... రత్నాకరుడు రానేవచ్చాడు. జంటపక్షుల్ని చూశాడు. పంట పండిందని మురిసిపోయాడు. ‘నిషాదుడా వద్దు, నిషాదుడా వద్దు’ - అంటూ పక్షులు వేడుకున్నాయి. కిరాతుడు ఆ కన్నీళ్లకు కరగలేదు. బాణం వదిలాడు. మగపక్షి ప్రాణంపోయింది. ఆడపక్షి గుండె పగిలింది. నా నీడలోనే అనుష్ఠుప్‌ ఛందస్సులో ‘మానిషాద’ శ్లోకం పుట్టింది. అభినందన పూర్వకంగా నాలుగు పచ్చనాకులు రాల్చాను.

మహాభారత ప్రశస్తిలో, ఆ కావ్యాన్ని చెట్టుతో పోల్చారు. భారతం ఓ మహావృక్షమైతే...ఉపనిషత్తులూ ధర్మశాస్త్రాలూ దాని కొమ్మలూ రెమ్మలూ! అన్నట్టు, నా కొమ్మ మీదున్న పక్షి కనుగుడ్డుకు గురిపెట్టే పార్థుడు విలువిద్య నేర్చుకున్నాడు. అజ్ఞాతవాసంలో పాండవులు నా జమ్మిచెట్టు మీదే ఆయుధాల్ని దాచిపెట్టి వెళ్లారు. నిజం చెప్పాలంటే నేను పాండవ పక్షపాతిని, ధర్మపక్షపాతిని. ధర్మమూ వృక్షమూ వేరువేరు కాదు. ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మమూ మనల్ని కాపాడుతుంది. వృక్షాలూ అంతేగా! ఏడాది తర్వాత...జాగ్రత్తగా అస్త్రశస్త్రాల్ని అప్పగించాను. కురుక్షేత్ర సంగ్రామంలో...అర్జునుడికి గీతోపదేశం చేస్తూ కృష్ణభగవానుడు ఓ మాట అన్నాడు...
‘వృక్షాల్లో నేను అశ్వత్థవృక్షాన్ని’.
ధన్యోస్మి. ధన్యోస్మి.
*
మనిషంతే. తనకు తెలిసిందే జ్ఞానమని భ్రమపడతాడు, తనకు తెలియనివన్నీ మహత్తులే అని సర్దిచెప్పుకుంటాడు. నేను అతడికి ఓ నిగూఢ రహస్యంలా అనిపించాను. నిన్న మొక్క, నేడు చెట్టు, రేపు మహావృక్షం. ఓ పూట పూతకొస్తుంది. మరోపూట పుల్లని కాయ కాస్తుంది. మరుసటి రోజుకంతా అదే కమ్మని పండై నోరూరిస్తుంది. ఆ మార్పులోనే ఏదో మహత్తు ఉందనుకున్నాడు. నాకు దైవత్వాన్ని ఆపాదించాడు. సంపద ఇవ్వమంటూ నా చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. సంతానం ప్రసాదించమంటూ వేపచెట్టుకూ రావిచెట్టుకూ పెళ్లి జరిపాడు. అలా అని, ఆ అభిమానాన్ని మూర్ఖత్వమనీ కొట్టేయలేను. అందులో కాస్తంత హేతువూ ఉంది. వేపచెట్టు గాలి పీలిస్తే, వూపిరితిత్తులకు మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. రావిచెట్టు గాలి రక్తపోటును నియంత్రిస్తుందని ప్రాచీన గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఆ ఔషధీకృత పవనాలు సంతానలేమిని కూడా పోగొట్టగలవని కొందరి విశ్వాసం. వృక్ష మహత్యాన్ని ఆధునిక వైద్యమూ అంగీకరించింది. ఇప్పటికీ, నూటికి అరవైశాతానికి పైగా ఔషధాల్లో మొక్కలో, బెరడులో ఉండితీరతాయి. కంటికి ఒత్తిడిగా అనిపించినప్పుడు...కాసేపు పచ్చని చెట్లను చూడాలంటారు. మానసిక సమస్యలున్నవారు... ధ్యానం లాంటి ఏకాంత స్థితిలో పచ్చదనాన్ని చూస్తూ కూర్చోవడం ‘గ్రీన్‌ థెరపీ’లో భాగం. చెట్టు ఆశావాదాన్నిస్తుంది. ఓ వ్యక్తి పచ్చని చెట్టును చూస్తున్నప్పుడు...అతడిలో, ఒత్తిడితో ముడిపడిన కార్టిసోల్‌ హార్మోను వూట పదమూడుశాతం పడిపోయినట్టు నిపుణులు గుర్తించారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే...చెట్ల మధ్య ఇల్లు కట్టుకున్న వయోధికుల్లో హృద్రోగ ప్రమాదం తక్కువని అంచనా. ఆసుపత్రుల్లో అయితే మంచం పక్కనే కిటికీ ఉంటే, ఆ కిటికీలోంచి పచ్చని చెట్లు కనిపిస్తుంటే...సగం రోగం నయమైనట్టేనని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. ఇంటిముందు చెట్టుంటే ఇంట్లో చెట్టంత వైద్యుడు ఉన్నట్టే. వృక్షాలు సిరిసంపదల్ని ప్రసాదిస్తాయా? అన్న ప్రశ్నకూ జవాబు ఉంది. ప్రతి చెట్టూ తన జీవితకాలంలో కాయల రూపంలోనో, కలప రూపంలోనో కనీసం ఐదు లక్షల రూపాయల విలువైన వస్తువుల్ని తన యజమానికి కానుకగా ఇస్తుంది. రోజూ విడుదల చేసే ప్రాణవాయువుకు కూడా వెలకడితే...ఆ మొత్తం కోట్లలోనే.

చెట్టు తెలివి!
చెట్లకు ఆత్మరక్షణ సామర్థ్యం ఉంది. ఏ హానికర సూక్ష్మజీవులో ఆకుల్ని తినేస్తున్నప్పుడు...ఆ రుచిని చేదుగానో పుల్లగానో మార్చేయగల శక్తి చెట్లకు ఉంటుంది. అవసరమైతే ఆకుల వాసననూ మార్చేసుకుంటాయి. అంతే కాదు, తమ మీద దాడిజరిగినప్పుడు..ఓ రకమైన రసాయనాన్ని గాల్లోకి వదిలి మిగతా వృక్షాలను ‘ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త’ అని హెచ్చరిస్తాయి కూడా. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం తేలింది.


నాలాంటి ఓ ముప్ఫై మీటర్ల చెట్టు ఏడాదికి పాతిక కిలోల బొగ్గుపులుసు వాయువును పీల్చుకుంటుంది. ఓ కారు నలభై అయిదువేల కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల ఏర్పడే కాలుష్యానికి అది సమానం. దుమ్మునూ ధూళినీ నా ఆకులు ఆకర్షిస్తాయి. దీంతో...మనిషి వూపిరితిత్తుల మీద కలుషితాల ఒత్తిడి తగ్గుతోంది. శ్వాస సంబంధమైన క్యాన్సర్‌ నుంచి ఏటా పది లక్షల మందిని, మేమే... మా వృక్షాలే కాపాడతాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఇన్ని అవాంతరాల మధ్య కూడా... మనిషి ఎంతోకొంత స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాడంటే అది మా పుణ్యమే. ప్రతి చెట్టూ ఏడాదికి దాదాపు మూడువేల కిలోల ప్రాణవాయువునిస్తుంది.
మనిషి ప్రతి వూపిరిలో నేనున్నాను.
ఆ మనిషేమో...నా వూపిరి తీసే ప్రయత్నంలో ఉన్నాడు.
*
చెట్టు నాటినవారు చిరంజీవులు - అంటోంది విష్ణు ధర్మోత్తర పురాణం. చరిత్ర చెబుతున్నదీ ఆ మాటే. కారే రాజుల్‌ రాజ్యముల్‌ కలుగవే... వారేరీ సిరిమూటగట్టుకొని పోవంజాలిరే? - అన్నట్టు ఎంతమంది పాలకులు పుట్టలేదూ, ఎంతమంది సార్వభౌములు గిట్టలేదూ. కానీ, రహదారులకు ఇరువైపులా చెట్లు నాటించిన ఆశోక చక్రవర్తి పేరునే ఇప్పటికీ తలుచుకుంటాం. సాధారణ మహిళ తిమ్మమ్మ...మర్రి మొక్కను నాటిన పుణ్యానికే చరితార్థురాలైంది. జనం దేవతలా కొలుస్తున్నారు. అనంతపురం జిల్లాలోని సువిశాలమైన తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ రికార్డులకూ ఎక్కింది. కన్నడదేశంలో సాలుమరద తిమ్మక్క వందల చెట్లను నాటిన పచ్చని తల్లి! ఆమెను వరించని అంతర్జాతీయ పురస్కారాలు లేవు. అమరత్వం అంటే చావు లేకపోవడం కాదు, మరణం తర్వాతా జనం గుండెల్లో బతికుండటం.
ఒక్క చెట్టును నాటితే వందసార్లు కాశీయాత్ర చేసినంత పుణ్యమని ఓ నమ్మకం. పాపపుణ్యాల ప్రస్తావన పక్కన పెడితే, మొక్కను నాటితే ప్రకృతికి మంచి జరుగుతుంది. గువ్వలూ కాకులూ గూళ్లు కట్టుకుంటాయి. చీమలూ దోమలూ పురుగూపుట్రా... చుట్టుపక్కల చేరిపోతాయి. మొత్తంగా, చెట్టును నమ్ముకుని బతికే జీవాల సంఖ్య ఐదొందల దాకా ఉంటుంది. అంటే, ఒక్క చెట్టును నాటితే ఐదొందల జీవాల్ని పోషించినట్టే. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణలో వీర సైనికులే. చెట్టుమీది పక్షులన్నీ పొలాల్లోని చీడపీడల్ని తిని, రైతుకు అండగా నిలుస్తాయి. పంటకు రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల దిగుబడి ఖర్చు తగ్గుతుంది. భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. పర్యావరణానికి రసాయనాల కీడు తప్పుతుంది. ఒక్కో చెట్టూ...గాలివానలకు కొట్టుకుపోకుండా ఏటా పాతిక కిలోల సారవంతమైన మట్టిని...కాపాడుతుంది. సారం తగ్గిపోతే, పంట తగ్గుతుంది. రైతు కుదేలైపోతాడు. ఏ ఆత్మహత్యో చేసుకుంటాడు. అప్పుల బాధతోనో, బాధ్యతల బరువుతోనో చెట్టుకు ఉరేసుకోడానికొచ్చే రైతుల్నిచూసిన ప్రతిసారీ నా గుండె విలవిల్లాడుతుంది. ‘అన్నా...రైతన్నా! వద్దన్నా...చావొద్దన్నా..’ అంటూ చేయిపట్టుకుని ఆపాలనిపిస్తుంది.

అమెజాన్‌ అడవులు
మెజాన్‌...ప్రపంచంలోనే అతిపెద్ద వర్షాధార అరణ్యం. భూగోళానికి వూపిరితిత్తుల్లాంటిది ఈ అడవి. దక్షిణ అమెరికాలో అరవై లక్షలా యాభైవేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉందీ మహారణ్యం. నలభైవేల రకాల వృక్షజాతులున్నాయిక్కడ. ప్రపంచమంతా వదిలే కార్బన్‌లో పదిహేడుశాతాన్ని అమెజాన్‌ అడవులే పీల్చుకుంటాయి. ఐదొందలకుపైగా అరుదైన జీవరాశులకూ ఇదే చిరునామా. ప్రపంచ జీవ వైవిధ్యంలో ముప్ఫైశాతం అమెజాన్‌లోనే ఉంది. మనిషి అవసరాలు ఈ పచ్చని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. కలప కోసం, సేద్యం కోసం, ఖనిజాల కోసం విచక్షణ లేకుండా చెట్లని నరికేస్తున్నారు. 2025 నాటికి అమెజాన్‌ అడవిలో నలభైశాతం దాకా కనుమరుగైపోవడం ఖాయమని పర్యావరణ ప్రియుల ఆవేదన. అమెజాన్‌ ప్రమాదంలో పడిందంటే..మనిషి ఉనికి కూడా ప్రమాదంలో పడినట్టే.


‘పొలంలో నాలుగు కొబ్బరి చెట్లేసుకో. పెరట్లో రెండు బొప్పాయి మొక్కలు నాటుకో. జాగా ఉంటే ఒకట్రెండు మామిడిచెట్లూ, జామచెట్లూ పెంచుకో. కరవురోజుల్లో అవే నీకు కడుపునిండా అన్నం పెడతాయి. చెట్టును నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడన్నా! కన్న బిడ్డలు మోసం చేస్తే చేయొచ్చు కానీ, పెంచిన చెట్లు నష్టం కలిగించవన్నా!’ అని హితవు చెప్పాలనిపిస్తుంది. అంతలోనే..ఘోరం జరిగిపోతుంది.
*
భూమీ - నేనూ...ఆత్మబంధువులం. మట్టి మమకారం మాది. ఆ ప్రేమతోనే నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. నా వేళ్లకు నీళ్లిస్తుంది. నా ఎదుగుదలకు ఎరువు అవుతుంది. నా విత్తనాలకు తన గర్భంలో ప్రాణంపోస్తుంది. నా ప్రియనేస్తం అప్పట్లో మట్టికుండలా చల్లగా ఉండేది. ఇప్పుడేమో, నిప్పు కణికలా భగభగ మండుతోంది.
మనిషి స్వార్థం కారణంగా ఏటా కొన్ని వేల చెట్లు నేల కూలుతున్నాయి. అడవులు అంతరించిపోతున్నాయి. దీంతో మేం మునుపట్లా చల్లగాలిని ఎరగా వేసి, మేఘాల్ని ఆకర్షించలేకపోతున్నాం. వర్షాల్ని కురిపించలేకపోతున్నాం. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎక్కడ చూసినా కరవుకాటకాలే. పల్లెల్లో... సాయంత్రం అయితే చాలు, పిల్లాజల్లా నాకింద చేరిపోయేవారు. ఆటలూ పాటలూ పద్యాలూ ...అదో జాతరలా ఉండేది. ఇప్పుడు వూళ్లలో ముసలీ ముతకా తప్ప ఎవరూ ఉండటం లేదు. వూళ్లకు వూళ్లు వలస వెళ్లిపోతున్నాయి. ఉన్న కొద్దిమందికి కూడా గొంతు తడుపుకోడానికి నీళ్లు లేవు. ఆమధ్య, ఓ చిన్నారి గుక్కెడు నీళ్లు అందక గొంతెండి చచ్చిపోయింది. ఎంత ఘోరం! పచ్చని చెట్లుంటే ఈ పరిస్థితి రాదు. ప్రతి చెట్టూ రోజుకు నాలుగువేల లీటర్ల నీటిని భూమిలోంచి తోడి మేఘాలకు అందిస్తుంది.

వృక్ష పురాణం
న పండగలన్నీ చెట్టుతోనో మొక్కతోనో ముడిపడినవే. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే నాగోబా జాతర గోండు గిరిజనుల ఉత్సవం. వారికి నాగోబా పచ్చదనాన్ని కాపాడే పెద్ద దేవుడు. తెలంగాణ బతుకమ్మ పండగంటే...పూలూ మొక్కలే. ఇక, ఆషాఢ బోనాల్లో వేపాకులు ఉండాల్సిందే. సమ్మక్క సారలమ్మలైతే సాక్షాత్తూ వనదేవతలే. దసరా రోజు జమ్మిచెట్టుకు పూజ చేయడం సంప్రదాయం. కార్తికంలో ఉసిరిచెట్టు కింద భోంచేయాలంటారు. వినాయక చవితికి రకరకాల ఆకులతోనే స్వామికి అలంకారం. నవకళేబరోత్సవం సందర్భంగా పూరి జగన్నాథుడి విగ్రహాన్ని చెట్టు కాండంతోనే తీర్చిదిద్దుతారు. సురాసుర యుద్ధంలో ... రాక్షసుల ధాటికి తట్టుకోలేక, శివుడు బిల్వవృక్షంలో, విష్ణువు రావిచెట్టులో, సూర్య భగవానుడు వేపచెట్టులో దాక్కున్నారట. అధర్వణవేదంలోని శాంతిమంత్రంలో ‘వనస్పతయః శాంతిః’ అంటూ...వృక్షసంపదకూ శాంతి జరగాలని కోరుకుంటారు. పండగలూ పురాణాల ద్వారా చెట్టు ప్రాధాన్యం చెప్పారు పెద్దలు. ‘దేవ’ అంటే ఇచ్చేవాడు. మనిషికి వరాలివ్వడంలో దేవతలైనా చెట్టు తర్వాతే.


కార్ఖానాలూ వాహనాల పొగలతో కాలుష్యం పెరిగిపోయింది. వృక్ష సంతతేమో బాగా తగ్గిపోయింది. ఎంత కాలుష్యాన్నని పీల్చుకోగలం. దాదాపుగా చేతులెత్తేయాల్సిన పరిస్థితి. వివిధ కారణాలతో భూమికి రక్షణ కవచమై నిలిచిన ఓజోన్‌ పొరకు చిల్లులు పడ్డాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఆ గాయాలే. విపరీతమైన వేడికి మంచు కరిగి సముద్రాల్లో చేరుతుంది. వరదలు పోటెత్తుతాయి. వూళ్లకు వూళ్లు కొట్టుకుపోతాయి. నా పరిసరాల్లో సంచరించే అమాయక మూగజీవాలూ ఆ విధ్వంసంలో కనుమరుగైపోతాయి. మొదట్లో ఎంత జీవ వైవిధ్యం ఉండేది. ఎన్ని రకాల జంతువులూ, ఎన్నెన్ని పక్షులూ. అవన్నీ నాచుట్టూ సందడి చేస్తుంటే పిల్లల కోడిలా మురిసిపోయేదాన్ని. అడవులతో పాటే జీవజాతులూ అంతరించిపోతున్నాయి. ప్రతి గంటకూ ఆరు జాతులు కనిపించకుండా పోతున్నాయట! ఒక జీవి మాయమైతే, దాన్నే నమ్ముకుని బతికే మరో జాతి సంక్షోభంలో పడుతుంది. దీంతో ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతింటుంది. అడవిలో ఉండే ఏనుగు వూళ్ల మీద పడుతుంది. గుహల్లో తలదాచుకునే సింహం తండాల మీద దాడికి దిగుతుంది. అడవిని అడవిగా ఉంచకపోవడమే చాలా తప్పు. చెట్టును చెట్టుగా బతకనివ్వకపోవడం అంతకంటే తప్పు. చేతులారా పర్యావరణాన్ని పాడు చేసుకున్న ఫలితమే ఇది.
*
స్వార్థం ఉప్పునీటి దాహం లాంటిది. గొంతు తడుపుకున్నకొద్దీ దప్పిక పెరుగుతుందే కానీ, తగ్గదు. మనిషి ఉన్మాదాన్ని చూస్తుంటే, సృష్టిలోని చిట్టచివరి చెట్టును కూడా పొట్టన పెట్టుకునేట్టున్నాడు. అదే జరిగితే...అతడి ఉనికికే ప్రమాదం.
చెట్టు లేని ప్రపంచంలో...
మనిషికి కూడా స్థానం లేదు.
స్వార్థంలో అసంతృప్తి ఉంటుంది. అత్యాశలో దుఃఖం అంతర్లీనం. అదే ప్రేమలో- అపారమైన త్యాగగుణం కనిపిస్తుంది. బతుకూ - బతకనివ్వూ ...అన్న మహత్తర సందేశమూ వినిపిస్తుంది. అందుకే నేను శాంతి సూత్రాన్ని బోధిస్తున్నా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు అయినా నన్ను హృదయపూర్వకంగా ప్రేమించండి. చెట్టును ప్రేమించడం అంటే...చెట్టు మూలాలున్న భూమిని ప్రేమించడం. చెట్టు గొంతు తడిపే నీటిని ప్రేమించడం. చెట్టే ప్రాణమైన ప్రాణవాయువును ప్రేమించడం. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసే వన్యమృగాల్ని ప్రేమించడం. మొత్తంగా పర్యావరణాన్ని ప్రేమించడం. ఇదంతా ఆలోచనకో, ఆకాంక్షకో పరిమితం కాకూడదు. పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ కావాలి. నా విన్నపాన్ని...పచ్చగా బతికేయడానికి ఓ చెట్టు పడే ఆరాటమని తేలిగ్గా కొట్టేయకండి. మనిషిని పదికాలాల పాటూ పచ్చగా బతికించడానికి...ఓ చెట్టు చేస్తున్న ప్రయత్నమని అర్థం చేసుకోండి.
ఇట్లు
మీ...చెట్టు!